తన దగ్గర అందరూ జీతగాళ్లలా ఉండాలనే భావనతో సీఎం కేసీఆర్ ఉంటారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం పోలింగ్ బూత్ బీజేపీ నాయకుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. గజమాలతో జిల్లా నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రాములు నాయక్, మదన్ లాల్ లను కేసీఆర్ తీవ్రంగా అవమానించారని అన్నారు.
‘‘గిరిజన నియోజకవర్గాలు ఎక్కువ ఉన్న జిల్లా ఖమ్మం. 5 నియోజకవర్గాలు ఉన్నాయి. అనాదిగా అడవిని, భూమిని నమ్ముకొని బతికే గిరిజన బిడ్డలు ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. వారికి సుఖం, శాంతి నిండు జీవితం అడవుల్లోనే ఉంది. అలా బతికే వారిని కేసీఆర్ హింస పెడుతున్నారు. భూముల్లోకి పోకుండా ట్రెంచ్ లు కొట్టారు. మా భూముల్లోకి రావొద్దు అని గిరిజన ఆడబిడ్డలు అడిగితే ఫారెస్ట్ అధికారులతో బూటు కాళ్ళతో తన్నించారు. మిర్చికి మద్దతు కావాలని రైతులు అడిగితే ఇదే ఖమ్మం జిల్లాలో సంకెళ్లు వేయించిన.. మరచిపోని గాయాలు ఎన్నో. ఇన్నీ చేసి దశాబ్ది ఉత్సవాల పేరిట మళ్లీ ఊర్లకు వచ్చి గొర్రె పోతులు కోసి దావత్ లు ఇచ్చారు’’ అంటూ విరుచుకుపడ్డారు ఈటల.
ధాన్యం కొనుగోలు చేయడంతో అలసత్వం వల్ల రైతుకు నష్టం వచ్చిందని.. క్విటాకు 10 కేజీల ధాన్యం కట్ చెయ్యడమే కాదు మిల్లుకు ట్రాక్టర్ పంపితే 5 వేలు లంచం ఇస్తే కానీ దించుకొలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క కిలో కూడా తరుగు లేకుండా కొని చూపిస్తామని తెలిపారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి మిగతా సబ్సిడీ పరికరాలు అన్నీ ఎగబెట్టారని ఆరోపించారు. పంట నష్టపోతే కేంద్రం అందించే ఫసల్ భీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టకుండా నష్టపరిహారం అందకుండా చేశారని విమర్శించారు. పైగా, తాను ఇస్తానన్న పది వేలు ఇవ్వలేదన్నారు.
బీజేపీ సర్కార్ వస్తే ఫసల్ బీమా యోజన అమలు చేస్తామన్న రాజేందర్.. దీనికోసం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ ఎక్కడ ఉందని అంటున్న కాంగ్రెస్.. గతంలో ఎన్టీఆర్ ని అవమానించిందని గుర్తు చేశారు. చివరకు ఆయన దెబ్బకు దిమ్మతిరిగిందని చురకలంటించారు. ‘‘ఖమ్మం చైతన్యవంతం అయిన జిల్లా. మార్పు కోరుకునే జిల్లా. నిర్భందాలకు లొంగదు. తెలంగాణ ఉద్యమంలో మొదటి తూటా పేలింది ఇక్కడే’’ అని వివరించారు.
57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్.. 60 ఏళ్లు నిండిన వాళ్లకు, భర్త చనిపోయిన వారికి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు ఈటల. ఎన్నికలు వచ్చాయి కాబట్టి అన్నీ ఇస్తానని అంటున్నారని.. ఆయనకు మనుషులు కాదు ఓట్లే గుర్తుంటాయని సెటైర్లు వేశారు. బీజేపీనీ ఆశీర్వదిస్తే 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తామన్నారు. అంతేకాదు, ముసలి వాళ్ళు ఇద్దరు ఉన్నా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు సాయంత్రం అయింది అంటే బిక్కుబిక్కుమని బతుకుతున్నారని.. మారుమూల పల్లెల్లో కూడా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. గిరిజన గూడెల్లో సారా బట్టీలు తీసేసి కేసీఆర్ లిక్కర్ ను అమ్ముతున్నారన్నారు. ప్రతి వందమంది మగవాళ్ళకు ఒక బెల్ట్ షాప్ పెట్టారని… సంపాదించిన పైసలు అన్నీ తాగుడికే పోతున్నాయని విమర్శలు చేశారు.
పెన్షన్, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, బీమా అన్నీ కలిసి కేసీఆర్ ఇస్తున్న డబ్బులు 25 వేల కోట్లు అయితే.. మద్యం ద్వారా మన దగ్గర లాక్కుంటున్న డబ్బులు 45 వేల కోట్లు ఉన్నాయని అన్నారు ఈటల. రైతు రుణమాఫీ డబ్బుల కోసం రింగు రోడ్డు కుదవపెట్టారని.. భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. దసరా పండుగకు పాడాల్సిన మద్యం వేలం పాట ఇప్పుడే పాడి రూ.2,600 కోట్లు వసూలు చేశారని అన్నారు. ‘‘బీజేపీ మీటింగ్ కి వేస్తే పెన్షన్ అపుతా అని బెదిరిస్తున్నారట. ఆ డబ్బులు నీ అబ్బ జాగీరు కాదు. నీ కారు నడిచేది మా చెమట పైసలతో. సంక్షేమ పథకాలు వాటిని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ప్రజల పైసలతో సోకులు పడుతున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళం. వారికి ఏం కావాలో తెలిసిన వాళ్ళం’’ అంటూ ప్రసంగం ముగించారు ఈటల రాజేందర్.