Telugu News » Eatala : బ్రోకర్లుగా మారిన బీఆర్ఎస్ నేతలు..!

Eatala : బ్రోకర్లుగా మారిన బీఆర్ఎస్ నేతలు..!

కేసీఆర్ 10 ఏళ్లల్లో ఒక్క రేషన్ కార్డ్ ఇచ్చారా అని ప్రశ్నించారు ఈటల. ఒడ్డు ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఎక్కాక బోడ మల్లన్న అనేది కేసీఆర్ నైజం అంటూ మండిపడ్డారు.

by admin
eatala rajender

కాళేశ్వరం (Kaleswaram) నీళ్లు బంధారం రాకముందే ప్రాజెక్ట్ గోదావరిలో మునిగిపోయిందన్నారు బీజేపీ (BJP) అభ్యర్థి ఈటల రాజేందర్ (Eatala Rajender). ప్రజల డబ్బుల్ని కేసీఆర్ గోదావరి పాలు చేశారని విమర్శించారు. గజ్వేల్ (Gajwel) నియోజకవర్గంలోని సిద్దిపేట (Siddipet) జిల్లా కొండపాక మండలం బంధారం, అంకిరెడ్డి పల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ (KCR) ఇప్పటిదాకా ఎలా ఓడిపోలేదో తాను కూడా ఓడిపోలేదని తెలిపారు. గజ్వేల్ బరిలో ఎవరికి ఓటమి వస్తుందో ప్రజల చేతుల్లో ఉందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మంచి విద్య, వైద్యం అందిస్తామని.. తనను నమ్మి ఆశీర్వదించాలని కోరారు.

eatala rajender

తాను గజ్వేల్‌ లోని ఏ గ్రామంలో పర్యటించినా అధికార పార్టీ నేతలు భూములు లాక్కున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్లు కూడా లాక్కుంటారని విమర్శించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో గెలిచేది బీజేపీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ కి ఓటు వేసిన ఖర్మానికి మీ భూములు పోయాయి. కేసీఆర్ ఖర్మ పోవాలంటే ఓడిపోవాలని గజ్వేల్ వచ్చా. ఎన్నడూ లేనిది కార్యకర్తలను బతిమలాడుతున్నారు. ఏది కావాలంటే అది ఇస్తా అంటున్నారు. ఇక్కడ ఇచ్చారా దళితబంధు, బీసీ బంధు అన్నీ అబద్ధపు మాటలు. దళిత బంధు కేవలం నన్ను ఓడగొట్టడానికి పెట్టారు’’ అని మండిపడ్డారు.

కేసీఆర్ 10 ఏళ్లల్లో ఒక్క రేషన్ కార్డ్ ఇచ్చారా అని ప్రశ్నించారు ఈటల. ఒడ్డు ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఎక్కాక బోడ మల్లన్న అనేది కేసీఆర్ నైజం అంటూ మండిపడ్డారు. ‘‘సద్దులు తినే దగ్గర, కలుపులు తీసే దగ్గర, వేప చెట్టు కింద కూర్చున్న దగ్గర ఆలోచన చేయండి. మన పిల్లలు ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతుంటే.. మీకు కాదు పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలు అని 17 పేపర్లు లీక్ చేశారు. ప్రవల్లిక అనే అమ్మాయి పరీక్ష పోస్ట్ పోన్ అయ్యిందని ఆత్మహత్య చేసుకుంటే, దానికోసం కాదు అని అబద్ధం చెప్పారు. ఖమ్మం జిల్లాలో రైలు కింద పడి ముత్యాల శంకర్ ఉద్యోగం రాలేదు అని చనిపోయాడు’’ అని వివరించారు.

బీజేపీనీ ఆశీర్వదిస్తే మీ అవసరాలు అన్నీ నెరవేరిస్తామని గజ్వేల్ ప్రజలకు తెలిపారు రాజేందర్. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మంచి విద్య, వైద్యం అందిస్తామన్నారు. మోడీ దేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నారు. ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో స్మశానవాటిక కట్టిస్తున్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రం నిధులే. నన్ను నమ్మండి.. ఆశీర్వదించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి’’ అని కోరారు.

ఇటు, గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌ లో బీజేపీ కార్యాలయాలకు ప్రారంభించారు ఈటల. ఉద్యమ నాయకుడు చేతిరెడ్డి లింగారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చి భూములపై హక్కులు లేకుండా చేశారని ఆరోపించారు. అధికార బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment