కేసీఆర్ (KCR) పాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు గజ్వేల్ (Gajwel) బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eatala Rajender). వర్గల్ మండలం నర్సంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంపాదించిన ప్రతిపైసా తాగుడికి పోతోందని.. ఆడబిడ్డలు ఆలోచన చేయాలని కోరారు. తండ్రులు తాగుతున్నారు.. కొడుకులు తాగుతున్నారని అన్నారు. మీకిచ్చే కల్యాణ లక్షీ, పెన్షన్ మిగతావి అన్నీ కలిపి 25వేల కోట్లు ఇస్తే తాగుడుతో కేసీఆర్ 45 వేల కోట్లు గుంజుకుంటున్నాడని విమర్శించారు.
10 ఏళ్లుగా నర్సంపల్లికి కేసీఆర్ ఏం వెలగబెట్టారు.. ఏం బాగుచేశారని ప్రశ్నించారు ఈటల. భూములు కాపాడుకోవాలంటే, రేషన్ కార్డు రావాలంటే బీఆర్ఎస్ (BRS) ను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. 45 సంవత్సరాలు కాంగ్రెస్, 16 ఏళ్లు టీడీపీ, 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలించాయని.. అందరినీ చూశాం.. ఈసారి మోడీకి అండగా నిలబడదామని ప్రజలు అనుకుంటున్నారని.. బీజేపీ (BJP) పాలన రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజాపాలన అందిస్తామన్నారు రాజేందర్. నర్సంపల్లిలో ఒక్కో బూత్ కి 6 పెట్టెల మందు, 50 వేల డబ్బు పంచుతున్నట్టు ఆరోపించారు. మందు పుక్కటికి వచ్చింది అని ఎక్కువ తాగొద్దని… ఆరోగ్యం కరాబ్ అవుతుందని సూచించారు. డబ్బులు ఎన్ని ఇచ్చినా తీసుకొండి కానీ.. ఓటు మాత్రం ధర్మానికి వేయాలని ప్రజలను కోరారు.
‘‘సత్యనారాయణ అనే రైతుకి 3 ఎకరాల భూమి పోతుంది అంట. మందు డబ్బా పట్టుకోవడమే దిక్కు అంటున్నారు. మనం చేయాల్సింది అది కాదు. ఓటుతో దెబ్బకొట్టాలి. చాలామంది భూములు పోయాయని తాగుడికి బానిసలయ్యారు. పిచ్చివాళ్లు అయిపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.