Telugu News » Telangana : పకడ్బందీగా ఎన్నికలు.. ఈసీ సమీక్ష

Telangana : పకడ్బందీగా ఎన్నికలు.. ఈసీ సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,375 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీస్ సిబ్బంది పాల్గొననున్నారు. 65 వేల మంది తెలంగాణ పోలీసులతో పాటు 18వేల మంది హోంగార్డులు ఉన్నారు.

by admin
ec-arrangements-for-elections

– తెలంగాణ ఎన్నికలకు ఏర్పాట్లు
– కట్టుదిట్టమైన భద్రత, నిఘా
– పోలీసులు, జిల్లాల అధికారులతో వికాస్ రాజ్ సమీక్ష
– ప్రలోభాల కట్టడి, చర్యలపై సూచనలు
– సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు ఫోర్స్
– 5 గంటలకు ప్రచారానికి తెర
– రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్​

తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుతోంది. ఎన్నికల సంఘం (Election Commission) పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలైంది. గురువారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా సీఈవో వికాస్‌ రాజ్‌ (Vikas Raj) సమీక్ష నిర్వహించారు. పోలీసులు, అన్ని జిల్లాల ఎన్నికల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

ec-arrangements-for-elections

ఎన్నికల సందర్భంగా ప్రలోభాలు కామన్ గా జరుగుతుంటాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7 వందల కోట్లకు పైగా నగదు పట్టుపడింది. ఉన్న ఈ కొద్ది సమయంలోనూ ప్రలోభాలు జోరుగా సాగే అవకాశం ఉండడంతో వాటి కట్టడికి ప్లాన్ చేస్తోంది ఈసీ. అలాగే, పోలింగ్‌ రోజున తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులతో చర్చలు జరిపింది. ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణకు సెంట్రల్‌ ఫోర్స్‌ కూడా వచ్చేసింది. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్స్‌ ను కేటాయించారు.

మంగళవారం సాయంత్రం 5 గంటలకి ప్రచారానికి తెర పడనుంది. పోలింగ్​ నేపథ్యంలో 48 గంటల ముందు నుంచే సైలెన్స్ పీరియడ్ మొదలు అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్​ అమల్లోకి వస్తుంది. సంబంధిత నియోజకవర్గానికి చెందని వారంతా ఆయా నియోజకవర్గాల్లో ఉండరాదని ఎలక్షన్​ కమిషన్​ ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే, టీవీ, సోషల్‌ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్‌ కోడ్‌ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలి.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,375 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీస్ సిబ్బంది పాల్గొననున్నారు. 65 వేల మంది తెలంగాణ పోలీసులతో పాటు 18వేల మంది హోంగార్డులు ఉన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు పాల్గొంటున్నాయి. రాష్ట్రంలో 4,400 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాల ద్వారా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ఎన్నికల విధుల్లో అసోం రైఫిల్స్, బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో అయితే ఎన్నికలకు అధికారులు భారీగా భద్రత చేపట్టారు. బందోబస్తులో భాగంగా 70 కంపెనీల కేంద్ర, రాష్ట్ర బలగాలను 3 కమిషనరేట్ల పరిధిలో 40 వేల మంది పహారా కాయనున్నారు. హైదరాబాద్ లో వెయ్యి వరకు సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. వాటి దగ్గర ఉన్న విధుల్లో కేంద్ర బలగాలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధిలో.. ర్యాలీలు, సమావేశాలను ఎన్నికల అధికారులు నిషేధాజ్ఞలు విధించారు.

You may also like

Leave a Comment