ప్రధాని మోడీ (PM Modi) ఓ ‘చెడు శకునం’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (Election Comission) కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసులు పంపింది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్ని నోటీసుల్లో ఆదేశించింది. శుక్రవారం సాయంత్ర 6 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడించింది.
ప్రధాన మంత్రిని ‘జైబ్‌కత్రా’(పిక్‌పాకెటర్)తో పోల్చడం, ‘పనౌటీ’అనే పదాన్ని ఉపయోగించడం రాహుల్ గాంధీ లాంటి వ్యక్తికి తగదని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారని తెలిపింది. గత తొమ్మిదేళ్లలో కార్పొరేట్లకు రూ. 14,00,000 కోట్ల రుణ మాఫీ చేశారని మోడీపై రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టడంలేదని ఫిర్యాదు చేశారని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 25న ఎన్నికల సంఘం ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు ప్రకటనలో పేర్కొంది. అంతకు ముందు ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేబు దొంగ ఒంటరిగా రారన్నారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అన్నారు. ముందు నుంచి ఒకరు, వెనుక నుంచి ఒకరు, దూరం నుంచి మరొకరు వస్తారని చెప్పారు.
ప్రజల దృష్టిని మరల్చడమే ప్రధాని నరేంద్ర మోడీ పని అని ఆరోపించారు. ప్రధాని మోడీ ముందు నుంచి టీవీలో వచ్చి హిందూ-ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రజల దృష్టిని మరల్చారన్నారు. ఇంతలో వెనుక ఆదానీ నుంచి వచ్చి డబ్బు తీసుకుంటారని ఆరోపణలు గుప్పించారు. ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా బాగా ఆడిందన్నారు. ఇంతలో ఓ చెడు శకునం (మోడీ) వచ్చి వారిని ఓడిపోయేలా చేసిందన్నారు.