కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్లు (Collectors), పోలీసు కమిషనర్లు (Police Comissioners), ఎస్పీలతో పాటు పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ఇటీవల పలువురు అధికారుల పనితీరు, వాళ్లపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా వచ్చిన ఫిర్యాదులు, దీంతో పాటు ధన ప్రవాహం, మద్యం పంపిణీ వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
బదిలీ అయిన వారిలో మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు వున్నారు. ఇక హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్, నిజామాబాద్ సీపీలను బదిలీ చేసింది. వారితో పాటు వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీలపై బదిలీ వేటు వేసింది.
బదిలీ అయిన అధికారులు వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉన్న ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ విభాగాలకు ముఖ్య కార్యదర్శులను నియమించాలని సూచించింది. అధికారుల బదిలీతో ఖాళీగా మారిన స్థానాల్లో అధికారుల నియామకం కోసం రేపు సాయంత్రం లోగా ప్యానెల్ పంపాలని ప్రభుత్వాన్ని కోరింది.
ప్యానెల్ లో ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లను సూచిస్తు తమకు ప్యానెల్ లిస్టు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల సన్నద్దతను పరిశీలించేందుకు కేంద్రం ఎన్నికల బృందం తెలంగాణలో పర్యటించింది. రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా పలువురు అధికారుల తీరుపై విపక్షాలు పెదవి విరిచాయి. ఆ అధికారుల తీరు సరిగా లేదని వారిని మార్చాలని ఈసీని కోరారు. దీంతో ఈసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.