ఢిల్లీ లిక్కర్ కుంభకోణం(D elhi Liquor Scam) కేసులో నేడు కీలక పరిణామం ఒకటి చోటు చేసుకోనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ(Am Admi Party) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind kejreewal) ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అవుతారంటూ ఆప్ ప్రచారం చేస్తోంది.
మద్యం డీలర్లకు భారీ ప్రయోజనం కలిగించేలా ఈ విధానాన్ని రూపొందించారని, ప్రతిగా వారి నుంచి కమీషన్లు పొందారని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. ఇదే కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ కావడం గమనార్హం.
కేసు దర్యాప్తులో భాగంగా నవంబరు 2న తమ ఎదుట హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కేజ్రీవాల్‌ను ఈడీ ప్రశ్నించింది. కానీ, తొలిసారి సమన్లు జారీ చేసి ప్రస్తుతం విచారిస్తోంది.
మరోవైపు.. ఆప్‌ను నిర్మూలించేందుకే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్‌పై బూటకపు కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు ఈడీ సమన్లు జారీ చేసిందని విమర్శలు గుప్పిస్తోంది. ఇక నేటి విచారణ సందర్భంగా కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఖాయం అంటూ ప్రచారం చేస్తోంది. కేవలం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే ఆయన్ని కటకటాల వెనక్కి పంపే ప్రయత్నం జరుగుతోందని ఆప్ ఆరోపిస్తోంది.