– హెచ్సీఏ నిధుల గోల్ మాల్
– కొనసాగుతున్న ఈడీ విచారణ
– ఎమ్మెల్యే వినోద్ కు నోటీసులు
– జనవరి మెదటి వారంలో విచారణకు ఆహ్వానం
కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే గడ్డం వినోద్ (Gaddam Vinod) ను ఈడీ (ED) వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (Hyderabad Cricket Association) లో 20 కోట్ల రూపాయల అక్రమాలపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అప్పటి అధ్యక్ష, కార్యదర్శలను అధికారులు విచారిస్తున్నారు.
ఈ కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ లను కూడా ప్రశ్నించారు. ఇదే క్రమంలోనే హెచ్సీఏ మాజీ అధ్యక్షడైన ఎమ్మెల్యే వినోద్ కు తాజాగా నోటీసులు పంపారు. జనవరి మొదటి వారంలో వినోద్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ఎన్నికల సమయంలో వినోద్ ఇంటిపై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆయనతో పాటు అనుచరులు, బంధువులు, మాజీ క్రికెటర్లైన శివలాల్ యాదవ్, ఆయూబ్ ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారు. 2013లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన నార్త్, సౌత్ స్టాండ్స్ లో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. అప్పట్లో 9 మందిపై నమోదైంది. ఏసీబీ చార్జీషీట్లు దాఖలు చేయగా.. వాటి ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
ఈ కేసులో అర్షద్ అయూబ్, వినోద్, డీఎస్ చలపతి, జాన్ మనోజ్, శేషాద్రీ, దేవరాజ్, నరేష్ శర్మ, కిశోర్ కపూర్ నిందితులుగా ఉన్నారు. గతంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు వినోద్. ఆ సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆఫీస్ బేరర్లు, ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యి మార్కెట్ ధరల కంటే అధికంగా కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించారని ఈడీ అనుమానిస్తోంది.