జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)మరోసారి షాక్ ఇచ్చింది. జార్ఖండ్ (Jharkhand) భూ కుంభకోణానికి (Land Scam) సంబంధించి దర్యాప్తునకు హాజరుకావాలని సోరెన్ ను ఈడీ ఆదేశించింది. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని సోరెన్ కు నోటీసులు పంపినట్టు ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ కేసు విచారణకు హేమంత్ సోరెన్ మంగళవారం హాజరయ్యే అవకాశం ఉన్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు హేమంత్ సోరెన్ కు ఈడీ ఆరుసార్లు నోటీసులు జారీ చేసింది. కానీ ఏడాది కాలంలో హేమంత్ సోరెన్ కేవలం ఒక్క సారి మాత్రమే విచారణకు హాజరయ్యారు.
ఇది ఇలా వుంటే సోరెన్ కు ఇప్పటి వరకు సమన్లు అందనట్టు సీఎం కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సమన్లు అందిన తర్వాత దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి. అంతకు ముందు ఈడీ సమన్లను సవాల్ చేస్తూ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మొదట హైకోర్టును ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ క్రమంలో సోరెన్ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురు అయింది. ఐదవసారి సమన్లపై ఆయన దాఖలు చేసిన పిటషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణకు సహకరించాలని సూచించింది.