తెలంగాణ ప్రజలకు ఎండ వేడిమి(Summer Effect) తీవ్రత నుంచి కాస్త ఉపశమనం కలిగించే వార్తను వాతావరణ శాఖ తీసుకొచ్చింది.మొన్నటివరకు రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న సూర్యుడి తాపం తొలగిపోయింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది(Cool Whether). దీంతో అటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చిరు జల్లులు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rains) కురుస్తోంది.
ఉన్నట్టుండి రాష్ట్రంలో వర్షాలు కురవడానికి అల్పపీడన ద్రోణి ప్రభావమే కారణమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. అదే ద్రోణి ప్రభావం రాష్ట్రంపై కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా నేడే, రేపు కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ముందస్తుగా ప్రకటించారు. ఈ ద్రోణి ప్రభావం ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలపై ఉంటుందని సమాచారం.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, అంబర్ పేట, చంపాపేట, సైదాబాద్,రాజేంద్రనగర్, తుర్కయాంజల్‌లో భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. నగరం ఒక్కసారిగా చల్లబడటంతో సిటీ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండు, మూడు రోజులు వాతావరణం ఇలాగే ఉండాలని, ఎండ వేడిమి తీవ్రతను తట్టుకోలేక పోతున్నామని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.