Telugu News » Telangana : ఇంకా భ్రమల్లోనే.. అధికారం పోయినా మారరా?

Telangana : ఇంకా భ్రమల్లోనే.. అధికారం పోయినా మారరా?

ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు.. తిమ్మిని బమ్మి చేసి.. వ్యవస్థను ఆడించారనే ఆరోపణలున్నా.. తాను మాత్రం సత్యహరిచంద్రుడినే అనే మాయలో ఇంకా ఉన్నట్లు చెప్పుకొంటున్నారు..

by Venu

– కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా అని వెయిట్ చేస్తున్న కేసీఆర్
– బీజేపీపై నమ్మకంతో ఆశలు
– ఓవైపు ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నా శ్రద్ధ అంతా అటువైపే
– అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా మారని తీరు
– అదే అహంకారం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు
– కేసీఆర్ ఎప్పటికీ మారరా?
– రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ

ఎవరు నవ్వితే నాకేంటి వారి పళ్లే బయటికి కనబడుతాయి అనే భ్రమలో గులాబీ బాస్ ఉన్నట్లు రాష్ట్రవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. పార్టీపై పట్టు కోల్పోయినా.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. ఇంకా అధికారంలో ఉన్నట్లు మాట్లాడటం కొందరికి వింతగా అనిపిస్తోంది. ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు.. తిమ్మిని బమ్మి చేసి.. వ్యవస్థను ఆడించారనే ఆరోపణలున్నా.. తాను మాత్రం సత్యహరిచంద్రుడినే అనే మాయలో ఇంకా ఉన్నట్లు చెప్పుకొంటున్నారు.

తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ఆయన చెప్పిన అబద్ధాలు బయటికి తీస్తే గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కడం ఖాయమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కుటుంబం బాగుకోసమే.. విపరీతమైన ఆస్తులు సంపాదించడం కోసమే అధికారం అనే ఆయుధాన్ని వాడుకొన్నారనే విమర్శలున్నాయి. అయినా బీఆర్ఎస్ ఓడిపోతే రాష్ట్రం కన్నీరు పెడుతుందనే నేతల మాటలకు విస్తుపోతున్నారు జనం. ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించే పెద్దాయన.. తనకు మాత్రమే అంతా తెలుసు అనేలా అధికారంలో ఉన్నన్ని రోజులు ఎందరిని అవమానించలేదని అనుకొంటున్నారు.

ప్రభుత్వం పడిపోయినా కూడా ఇంకా ఆ అహంకారం తగ్గకపోవడం మాత్రం పూర్తి పతనానికి దారి తీస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి మాటలే మాట్లాడటం చూసి నవ్వుకొంటున్నారు. ఆయన మాటలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో కారును ఖాళీ చేస్తున్న విషయాన్ని గమనించకపోవడం దేనికి సూచన అనే వాదన వినిపిస్తోంది.

ఇప్పటికీ బీఆర్ఎస్ దే పై చేయి, రాష్ట్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుందనే భ్రమలో ఉన్న ఆయనను చూసిన జాలిపడుతున్నారు. విపక్షంగా మారిన క్షణం నుంచీ బీఆర్ఎస్ స్థిమితంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక దగ్గర నుంచీ అంతటా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పార్టీ నేతలూ, కేడర్ వ్యవహరించారు. అయితే, 104 సీట్లు వచ్చినప్పుడే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది.. 64 సీట్లతో కాంగ్రెస్‌ను అధికారంలో ఎలా కొనసాగనిస్తుందన్న ధీమాతో ఆయన ఊహల్లో ఊరేగుతున్నారని అనుకొంటున్నారు. పైగా, ఓవైపు ఎమ్మెల్యేలు జారిపోతుంటే, తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందనే చర్చ జరుగుతోంది.

You may also like

Leave a Comment