తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Election)కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీసులు లక్షమంది సిబ్బందితోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ (Betting) దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
గురువారం సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలు వెలువడే డిసెంబర్ 3వ తేదీ వరకు బెట్టింగ్ దందా నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రూ.2,500 కోట్లకుపైగా దాందా సాగినట్లు తెలుస్తోంది. రూ.10వేల కోట్లు దాటినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లేదా తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నట్లు సమాచారం.
నెల క్రితమే ఏపీలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయని రూ.వెయ్యికోట్ల దందా జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఏపీతో పాటు ముంబై, ఢిల్లీ, కోల్కతా, ఇతర నగరాల నుంచి ఇది జరుగుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ నిర్వాకం రాష్ట్రాలు, దేశం దాటి ఖండాలకు చేరింది. కొందరు బుకీలు లండన్, అమెరికాల నుంచి యాప్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తోంది.
మరోవైపు తెలంగాణ ఎన్నికల విధుల్లో నిర్వహించేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ సిబ్బంది వచ్చారు. 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,400 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనంగా సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను బద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.