రాజకీయం అనేది ఉద్యోగం కాదు.. ప్రజా సేవ అని అందరికీ తెలుసు.. ఉచితంగా చేయవలసిన ఈ సేవను.. ఖరీదైన సేవగా మార్చాయి నేటి రాజకీయాలు.. అందుకే కావచ్చు పదవిలో ఉన్న వారు లక్షలకు, కోట్లకు పడగలెత్తుతున్నారు.. ఓటు వేసినవాడు మాత్రం బికారి అవుతున్నాడని కొందరు మేధావులు ఆలోచిస్తున్నారు.
ఇక అధికారంలోకి రావడానికి నేతలు చెప్పే అబద్ధాలు వింటే సత్య హరిచంద్రుడు ఆత్మహత్య చేసుకుంటాడు కావచ్చు.. యముడు యమలోకం వదిలి పిచ్చాసుపత్రికి పరిగెడుతాడు కావచ్చు అని నిజాయితీగా బ్రతికే వారు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన బీఆర్ఎస్ నేతలకు నిరసన జ్వాలలు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో వివాదాలను కేరాఫ్ గా మార్చుకొన్న బెల్లంపల్లి (Bellampally) ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రచారంలో ఊహించని అవమానం జరిగింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కుశ్ననపల్లి (Kushnanapally) గ్రామానికి.. దుర్గం చిన్నయ్య (Durgam Chinnayya) ఎన్నికల ప్రచారానికి (Election Campaign) వెళ్ళగా.. ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలోకి రావద్దని ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. పోడు భూముల పట్టాలతో పాటు తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చిన్నయ్య చేయలేదని కెరటంలా దూకారు..
మరోవైపు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాహనం దిగి గ్రామస్తులను నెట్టుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు గ్రామస్తులను తోసి వేయడం పై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధిపై నిలదీసిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే ప్రజలపై దురుసుగా వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి..