తెలంగాణ (Telangana)లో అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) పావులు కదుపుతుంది. ముఖ్యంగా సమర్ధవంతమైన పాలన అందించడంలో కేసీఆర్ విఫలం అయ్యారని దుమ్మెత్తి పోస్తుంది కాంగ్రెస్.. ఇప్పటికే ప్రచారాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో హస్తం దూసుకెళ్తుంది. మరోవైపు ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ బీఆర్‌ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ (KCR) కుటుంబం ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించడం లేదని.. తెలంగాణ ఉద్యమ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరటం లేదని.. ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు.. ఇందిరా గాంధీ, గిరిజనుల, ఆదివాసీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపిన ప్రియాంక గాంధీ.. ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇప్పటికి ప్రజలు ఆరాధిస్తున్నారని గుర్తు చేశారు.. మరోవైపు కొమురం భీం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సభలో ఆమె పాల్గొన్న ప్రియాంక గాంధీ.. ఇక్కడ కూడా బీఆర్‌ఎస్ వైఫ్యల్యాలపై ఘాటుగా స్పందించారు.
బీఆర్‌ఎస్ (BRS)ను రెండుసార్లు నమ్మి ఓటు వేస్తే.. రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి పంపించిందని ప్రియాంక గాంధీ విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ పేరుతో కారు పార్టీ మోసం చేసిందని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు అప్పులు పాలవుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన ప్రియాంక గాంధీ.. కాళేశ్వరం, దిల్లీ మద్యం స్కామ్‌పై ప్రధాని మోదీ అసలు మాట్లాడరని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యమకారుల కుటుంబంలో.. ఒకరికి ఉద్యోగం ఇస్తామని.. రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రియాంక గాంధీ వివరించారు. పంటలకు మద్దతు ధర పెంచుతామని అన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని.. రైతుబంధు కింద రైతులకు ఎకరాకు రూ.15,000 అందివ్వడమే కాకుండా.. 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రియాంక గాంధీ తెలిపారు.
మరోవైపు ఉచితంగా ఇంటి స్థలంతో పాటు.. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు సాయం చేయనున్నట్లు.. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రజలకు రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని ప్రియాంక గాంధీ సభలో వెల్లడించారు. ప్రజాధనం ప్రజలకే చెందాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రియాంక గాంధీ తెలిపారు.