ఎన్నికల్లో ఎంతటి సాధారణ వ్యక్తులైనా పోటీ చేయవచ్చు అనడానికి ఈ వ్యక్తే నిదర్శనం. దేశంలోనే ఎక్కువ సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ‘ఎలక్షన్ కింగ్’(Election King)గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్లు వేసి రికార్డు సృష్టించాడు. 236సార్లు పరాజయం పాలైనా ఎన్నికల్లో నామినేషన్ వేయడం మాత్రం మానలేదు. పేరు మోసిన ఎంతోమందితో ఆయన బరిలోకి దిగాడు. అయితే ఇప్పుడా వ్యక్తి సీఎం కేసీఆర్(KCR)కు పోటీగా నామినేషన్ వేయడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కె.పద్మరాజన్ టైర్లు పంచర్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈయన గజ్వేల్‌లో వేసిన నామినేషన్‌తో కలిపి ఇప్పటి వరకు 237సార్లు ఎన్నికల్లో నామినేషన్లు వేసినట్లు తెలిపాడు.
పద్మరాజన్ 1988 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తమిళనాడులోని మెట్టూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసే మారథాన్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావుపై కూడా పోటీ చేశాడు. తాను పోటీ చేసిన ప్రతీసారి పరాజయం పాలయ్యాడు. ‘ఎలక్షన్ కింగ్’గా ప్రసిద్ధి చెందిన ఆయన తమిళనాడు, కర్ణాటక, యూపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు జరిగే ఎన్నికల్లో ఇది తన 237వ నామినేషన్ వేసినట్లు తెలిపాడు.
ఇప్పటి వరకు 32 లోక్‌సభ , 50రాజ్యసభ, 75అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపాడు. ఈ ఎలక్షన్ కింగ్‌కు 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టూరు నియోజకవర్గంలో పోల్ చేసినప్పుడు అత్యధిక ఓట్లు 6273 వచ్చాయని, కొన్ని పంచాయతీ అయితే ఒక్క ఓటూ పడలేదని చెప్పాడు. తాను 8వ తరగతి వరకు చదివానని, అన్నామలై ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ (హిస్టరీ) చదువుతున్నానని అఫిడవిట్‌లో పేర్కొన్నాడు.