తెలంగాణ (Telangana)లో ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ (KTR) స్పందించారు. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వస్తుందని తాము భావించామన్నారు. కానీ తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని తెలిపారు. ఓటమిపై లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. లోపాలను సవరించుకుని తిరిగి పుంజుకుంటామని వెల్లడించారు.
ఈ ఏడాది ఆగస్టులో అభ్యర్థుల ప్రకటించిన రోజు నుంి సుమారు 100 రోజులగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని అన్నారు. వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నామో, ఓటమి తర్వాత కూడా అంతే స్థాయిలో బాధ్యతగా ఉంటామన్నారు.
గతంలో అనుకున్నట్లుగా తెలంగాణను సాధించామన్నారు. అధికారంలో మంచి పాలన చేశామని సంతృప్తిగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ఓటమి నేపథ్యంలో కొంత బాధగా ఉందన్నారు. కానీ బంతిలాగా మళ్లీ వేగంగా తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ప్రతిపక్షంలో ఉండి గతంలో కన్నా ఈ సారి మరింత కష్టపడుతామన్నారు.
ఈ ఓటమికి నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. కేసీఆర్ సారథ్యంలో మరింత కష్టపడతామన్నారు. 14 ఏండ్లు పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అలాగే రాష్ర వృద్ధికి కృషి చేద్దామన్నారు. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామన్నారు.