సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల ప్రకారం రెండో విడత ఎలక్టోరల్ బాండ్లపై మరింత డేటాను ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. ఈ డేటాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈసీ ఇచ్చిన డేటా ప్రకారం తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీకి రూ.656 కోట్లు వచ్చాయి. ఇందులో రూ.509 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కొనుగోలు చేశారని తెలిపింది.
అదేవిధంగా బీజేపీ (BJP)కి మొత్తం రూ.6,986.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) నగదుగా మార్చుకొంది. అందులో అత్యధికంగా రూ.2,555 కోట్లు 2019-20 మధ్య వచ్చాయని పేర్కొంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1,397 కోట్లు పొందిందని తెలిపింది. అలాగే రూ.1,334.35 కోట్లు విలువైన ఎలక్టోరల్ బాండ్లను కాంగ్రెస్ (Congress) నగదుగా మార్చుకొంది.
ఇక తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ (BRS) రూ.1,322 కోట్లు విలువైన ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మార్చుకుంది. దీంతో ఈ బాండ్ల ద్వారా అత్యధికంగా విరాళాలు సేకరించిన నాలుగో అతిపెద్ద పార్టీగా, బీఆర్ఎస్ అవతరించింది. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మిగతా పార్టీలకు ఎంత వచ్చాయో చూస్తే.. బీజేడీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.944 కోట్లు సమకూర్చుకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్-రూ.442.8 కోట్లు వచ్చాయి.
టీడీపీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 181.35 కోట్లు రాబట్టుకోగా.. సమాజ్వాదీ పార్టీకి రూ.14.05 కోట్లు.. అకాలీదళ్ రూ.7.26 కోట్లు.. ఏఐడీఎంకే రూ.6.05 కోట్లు.. నేషనల్ కాన్ఫరెన్స్ రూ.50 లక్షలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందినట్లు ఈసీ ఇచ్చిన డేటాలో పొందుపరిచారు..