సుప్రీంకోర్టు(Supreme court) గురువారం సంచలన తీర్పు చెప్పింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల(electoral bonds scheme) పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది.
రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఎలాంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని పేర్కొంది. ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్‌బీఐకి ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.