ఎలక్టోరల్ బాండ్స్ కేసు(Electoral Bonds Case)లో సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి ఎస్బీఐ(SBI)పై అసహనం వ్యక్తం చేసింది. బాండ్ల వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించలేదంటూ మండిపడింది. గడువు లోగా వివరాలు ఇవ్వలేదని ఇప్పటికే సుప్రీకోర్టు ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్బీఐ అప్రమత్తమై ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించింది.
అయినప్పటికీ ఎస్బీఐ సమర్పించిన వివరాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఎలక్టోరల్ బాండ్స్ సంఖ్యని కూడా వెల్లడించాలని తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘానికి ఎస్బీఐ ఇచ్చిన డేటా అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది.
‘ఎస్బీఐ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఇప్పటి వరకూ ఎలక్టోరల్ బాండ్స్ సంఖ్య ఎంతో వెల్లడించలేదు. కచ్చితంగా ఈ వివరాలను సమర్పించాల్సిందే’ అని సుప్రీంకోర్టు ఎస్బీఐకి పంపిన నోటీసుల్లో పేర్కొంది. వివరాలు అసంపూర్తిగా ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మార్చి 18వ తేదీన మరోసారి దీనిపై విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.
జూన్ 30వ తేదీ వరకూ గడువు ఇవ్వాలని, ఆలోగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్బీఐ సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేయగా మార్చి 11వ తేదీన ఈ పిటిషన్ని కొట్టివేస్తూ గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పూర్తి స్థాయిలో పరిశీలించాలని సుప్రీంకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో బహిర్గతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.