సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్(X) ప్రవేశపెట్టిన పెయిడ్ సబ్‌స్ర్కిప్షన్‌లో ఉగ్రవాదులకూ బ్లూటిక్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ది టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్టు (TTP) అనే సంస్థ ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. అమెరికా భూభాగంపై కార్యకలాపాలను నిర్వహించడంపై నిషేధం ఎదుర్కొంటున్న హెజొబొల్లా వంటి సంస్థలు కూడా వీటిల్లో ఉన్నట్లు వెల్లడించింది.
నెలకు 8 డాలర్లను చెల్లిస్తే బ్లూటిక్ లభిస్తుంది.. దీంతోపాటు సుదీర్ఘ పోస్టు పెట్టడానికి, మెరుగైన ప్రమోషన్‌కు ఇది ఉపయోగపడుతుంది. ట్విటర్‌ను కొనుగోలు చేశాక బ్లూటిక్ కోసం సొమ్ము వసూలు చేయాలన్నది మస్క్ (Elon Musk) తీసుకొన్న అతిపెద్ద వివాదాస్పద నిర్ణయమని, ఇలా చేస్తే తప్పుడు సమాచార వ్యాప్తి తీవ్రతరమవుతుందని చాలా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఎక్స్ తాజా నిర్ణయంతో సమస్యలు ఎదురవ్వడం మొదలయ్యాయని టీటీపీ సంస్థ పేర్కొంది. ఈ నివేదిక వెలువడిన తర్వాత కొన్ని సంస్థల బ్లూటిక్స్‌ను ఎక్స్ తొలగించడం గమనార్హం. అన్సార్ అల్లా (హూతీలు) సంస్థ బ్లూటిక్ తొలగించబడింది. దీనిని 23,000 మంది అనుసరిస్తున్నారు. ఈ సంస్థపై అమెరికా, యూకేలో ఆంక్షలున్నాయి.
అయితే ఇంకా చాలా సంస్థల బ్లూటిక్‌లు కొనసాగుతున్నట్లు టీటీపీ పేర్కొంది. తన సామాజిక మాధ్యంపై ఎక్స్ నియంత్రణ కోల్పోయిందని ఆ సంస్థ సంస్థ డైరెక్టర్ కేటీ పాల్ పేర్కొన్నారు. గతంలో ఈ బ్లూటిక్‌ను ట్విటర్ ఉచితంగా కేటాయించేది. దీనిని పొందే వ్యక్తుల వివరాలను సదరు సంస్థ ధ్రువీకరించుకొనేది. బ్లూటిక్‌ను పొందేవారిలో అత్యధికంగా జర్నలిస్టులు, ప్రపంచ నేతలు, ఇతర సెలెబ్రిటీలే ఉండేవారు.