టెస్లా కంపెనీ ఓనర్ ఎల్లన్ మస్క్(Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) వెనక్కి తగ్గితే అతడి ప్రాణాలకే ప్రమాదముందని హెచ్చరించాడు.
యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు మరింత సాయాన్ని అందించాలని, సేనేట్‌లో బిల్లు పెట్టిన నేపథ్యంలో మస్క్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ వార్‌లో పుతిన్ ఓడిపోరన్న అభిప్రాయాలను మస్క్ సమర్థించారు. ఉక్రెయిన్ గెలుస్తుందనే కల్పిత ప్రపంచంలో ఉండవద్దన్నారు.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోడని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం అంటే ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పొడిగించడమే అవుతుందన్నాడు. యుద్ధాన్ని కొనసాగించాలన్న ఒత్తిడి పుతిన్‌పై ఉందని, ఒకవేళ వెనక్కి తగ్గితే అతన్ని హతమార్చినా ఆశ్చర్యంపోవాల్సిన పనిలేదని మస్క్ తెలిపాడు.
95బిలియన్ల డాలర్ల సాయాన్ని అందించేందుకు అమెరికా సేనేట్‌లో బిల్లు పెండింగ్‌లో ఉన్నదని, రెండు వైపులా మరణాలు ఆగాలని ఆశిస్తున్నట్లు మస్క్ చెప్పారు. ఒకవేళ రష్యాలో ప్రభుత్వం మారాలని భావిస్తే అప్పుడు దానికి తగిన వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పారు. కానీ ఆ వ్యక్తి పుతిన్ కన్నా కఠిన వ్యక్తే అయి ఉంటాడని అభిప్రాయపడ్డారు.