ఇరాన్, ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా ఇజ్రాయోల్ క్షిపణిని ప్రయోగించింది. ఈ పరిణామాల వేళ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఆసక్తికర పోస్ట్ చేశారు.
పరస్పరం రాకెట్ ప్రయోగాలు చేసుకోవడం కాదని రాకెట్లను అంతరిక్షంలోకి పంపిద్దామని సూచించారు. మస్క్ ట్వీట్‌లో “మనమంతా రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మానాలి. వాటిని అంతరిక్షంలోకి పంపించాలి” అంటూ శాంతియుత పరిస్థితులకు ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగించిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
గతంలోనూ మస్క్ హమాస్ దాడిలో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ గాజాలో చేసిన విధ్వంసాన్ని చూడాలంటూ హమాస్ మస్క్‌ను ఆహ్వానించింది. ఇదిలా ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ లోని అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్పహాన్ నగరంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో అధికారులు వెంటనే గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు.
గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను రక్షణ వ్యవస్థ సమర్థంగా కూల్చివేసిందని, ఆ పేలుడు శబ్దాలు దానివేనని ఇరాన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు తెలుస్తోంది. టెహ్రాన్ ప్రధాన ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి. అయితే, ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ వెళ్లే విమానాలను పలు దేశాలు రద్దు చేశాయి.