ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడ (Dhantewada) జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. దంతెవాడ జిల్లోని నక్సల్స్ (Naxals) ప్రభావిత ప్రాంతమైన హిద్మా అడవుల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, నక్సల్స్ మధ్య జరిగాయని సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.
జిల్లాలోని హిద్మా అడవులు నక్సల్ ప్రభావిత ప్రాంతం. ఇది నక్సల్స్ కు హైడ్ అవుట్ ఏరియాగా ఎంతో కాలంగా ఉంది. ఇక్కడ సీనియర్ నక్సల్స్ ఉంటారని పోలీసులు వివిధ సందర్భాల్లో చెప్పారు. ఈ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీనియర్ నక్సల్స్ మరణించచినట్లు తెలుస్తుంది.
డీఆర్జీ జవాన్లు ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. గత కొన్ని రోజులుగా ఇక్కడున్న అటవీ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇలా సాగుతున్న సెర్చింగ్ లో పోలీసులకు, హిద్మా ప్రాంతంలో నక్సల్స్ తారసపడ్డారు. దీంతో వారి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చాలా సేపు సాగిన ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ చనిపోయినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో భారీ సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. అయితే పోలీసుల్లో ఎవరికైనా ఈ కాల్పుల్లో ఏవైనా గాయాలైయ్యాయా లేదా ఎవరైనా మరణించారా వంటి సమాచారం మాత్రం తెలియడం లేదు. మరో వైపు నక్సల్స్ మరణించారనే వార్తని కూడా పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.