గురువారం రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ (Swachh Bharat Mission) గ్రామీణ అవార్డులు -2023 విజేతలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakararao) సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందిచనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వల్లే తెలంగాణ పల్లెలు అవార్డులు తీసుకునే స్థాయికి వెళ్లాయన్నారు. రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన ఈ నలభై గ్రామాలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాలని కోరారు.
అనేక అంశాల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు సూచించే కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు మాత్రం అన్ని రంగాల్లో సహాయనిరాకరణనే పాటిస్తోందన్నారు. కేంద్రం ఒక్క అడుగు ముందుకేసి రాష్ట్రానికి చేయూతనిస్తే తెలంగాణా మరింత అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందనీ… ఏడాదిలోనే 20 అవార్డుల ప్రకటిస్తే 19 అవార్డులు కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. పలు అంశాల్లో ఆన్‌లైన్‌లో వేసే మార్కుల్లోనూ తెలంగాణ పల్లెలు మొదటి స్థానంలో నిలిచాయన్నారు. రాష్ట్రం నుంచి వివిధ కేటగిరీల్లో 600లకు పైగా ఎంట్రీలను పంపించామన్నారు. ఈ సారి కూడా పలు అవార్డులను సాధిస్తామన్నారు.