కుల సంఘాల భవనాలను వెంటనే నిర్మించాలని బీజేపీ (BJP) తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎంఎమ్మెల్యే (MLA) ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. ఇప్పటికీ అసలే గుర్తింపు లేని కులాలు చాలా ఉన్నాయని చెప్పారు. ఇంకా కులం పేరు చెప్పేందుకు సిగ్గుపడే కులాలు (CASTS) చాలా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇందిరా పార్క్ వద్ద పూసల సంఘం ధర్నా కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ….. తాను మంత్రిగా పని చేసిన సమయంలో అసెంబ్లీలో కులాల వారీగా ప్రజలను కూర్చోబెట్టి వారి సమస్యలను నోట్ చేసుకున్నానని తెలిపారు. 250 రెసిడెన్షియల్ పాఠశాలల్లో సంచార జాతుల వారికి ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
ఆ సమావేశం వల్లనే హైదరాబాద్‌లో కులసంఘాల భవనాలు వచ్చాయని చెప్పారు. కానీ డబ్బులు ఇవ్వక పోవడంతో నాలుగున్నర సంవత్సరాలైనా ఆ భవనాల నిర్మాణం జరగలేదన్నారు. వెంటనే కుల సంఘాల భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూసల కులస్తులు 10 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చుకొని గాజులు కొనొక్కుని విక్రయిస్తున్నారని చెప్పారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో వారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 50 వేల చెక్కును ఇచ్చామని చెప్పారు. కానీ ఇప్పుడు వాటిని కూడా నిలిపి వేశారన్నారు.
52 సంచార జాతులు ఉంటే అందులో కేవలం 14 కులాలను మాత్రమే గుర్తించారని పేర్కొన్నారు. వారికి కూడ నిధులు ఇవ్వడం లేదన్నారు. 100 ఎకరాల భూస్వామికి కూడా ప్రతి ఏడాది రైతు బంధు కింద పది లక్షల రూపాయలను కేసీఆర్ ఇస్తున్నాడన్నారు.
వాళ్లంతా బెంజ్ కారులో వచ్చి చెక్కులు తీసుకుంటున్నారని ఆరోపించారు. కానీ పూసలు అమ్ముకొనే వారికి మీరు ఇచ్చేది ఎంత ? అని నిలదీశారు. తన లాంటి బిడ్డకు అధికారం ఇస్తే 50 వేల లెక్క లిమిట్ లేకుండా ఇస్తామన్నారు. బీమా కింద రైతుకు, కల్లు గీత కార్మికులకు, మత్స్యకారులకు, గొర్ల కాపరులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. కానీ రైతు కూలీలకు మిగిలిన పేదవారికి మాత్రం ఇవ్వడంలేదన్నారు.
తాము అధికారంలోకి రాగానే తెల్లరేషన్ కార్డు కలిగి వుండి 59 ఏండ్ల లోపు వ్యక్తులు మరణిస్తే వాళ్ల కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయలు మె8నిఫెస్టోలో పెడతామన్నారు. ఎంబీసీలకు కేటాయించిన డబ్బులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. ఇదేనా ఈ వర్గాల మీద కేసీఆర్ కు ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే కేటాయించిన ప్రతి రూపాయి ఖర్చు పెడతామన్నారు.