సీఎం కేసీఆర్(Cm kcr)పై బీజేపీ(bjp) తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Etala Rajender) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కేసీఆర్ ది కుటుంబ పార్టీ అని ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్య మంత్రి అయ్యే అవకాశం ఉందని, ఇతరులకు ఆ అవకాశం లేదన్నారు.
పరకాలలో నిర్వహించిన బీజేపీ సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ…. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని అన్నారు. సెప్టెంబర్- 17న రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
సెప్టెంబర్ 17న తెలంగాణలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి అమిత్ షా అని కొనియాడారు. నిజాంకు వారసులు కాకపోతే విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని నిలదీశారు. కేయూ విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించిన నిజాం కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు పెన్షన్ ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వానిది ఉద్దెర బేరమని మండిపడ్డారు. బీజేపీది నగదు బేరమని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ రూ. 600కోట్లు ఖర్చు చేశారన్నారు. కేసీఆర్ తీరుపై పోలీసులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో వున్నారన్నారు. ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ కేసీఆర్ కు సహకరించరన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రిటర్న్ గిప్ట్ ఇస్తామని వెల్లడించారు. నిజాం సర్కారే మట్టిలో కలిసిపోయింది… కేసీఆర్ సర్కార్ ఎంత..? అని అన్నారు.