సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతనలేని వ్యక్తి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. గజ్వేల్(Gajwel) నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం చిన్న కిష్టపూర్ ఎన్నికల ప్రచారంలో ఈటలతో పాటు గోవా ఎమ్మెల్యే దయానంద్, మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను బయటి వ్యక్తిని కాబట్టే ఆ పార్టీ నుంచి నెట్టివేశారని.. హరీశ్‌రావు అల్లుడు కాబట్టే బచాయించాడని అన్నారు. బయటి వ్యక్తి అయినందునే తనను నట్టేశారని వాపోయారు. తమది దొరల కుటుంబం కాదని, ఆకలి, దు:ఖం తెలిసిన వాళ్లమని ఈటల తెలిపారు. కోట్ల మంది సభ్యత్వం ఉన్న బీజేపీతో పోలిస్తే నీ పార్టీ ఎంత.. నీ లెక్క ఎంత..? అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు ఈటల.
దళితబంధు, బీసీబంధు, డబుల్ బెడ్‌రూం ఇల్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు, విద్య, వైద్యం ఏది ఇవ్వలేదని దుయ్యబట్టారు. పంట పొలాలకు కూడా పూర్తిగా నీళ్లు రాలేదని ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు వస్తాయనుకుంటే అది కూడా కుంగిందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న తనను పక్కకు పిలిపించుకుని బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని తనకు చెప్పారని, పేదలకు కావాల్సినన్నీ చేస్తామన్నారని తెలిపారు.
కేసీఆర్ అబద్దాలతో తిమ్మిని బమ్మిని చేయగలడని, ఆయనలా అబద్దాలు చెప్పే నైపుణ్యం మాకు లేదని ఈటల అన్నారు. 10 ఏళ్ల నుంచి ఇళ్లు కట్టడం చేతకాని కేసీఆర్ ఇప్పుడు రూ.3లక్షల ప్రొసీడింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటల్లోనే చెప్తాడని, బీజేపీ చేతల్లో చూపిస్తుందని తెలిపారు.