ఉద్యోగులను బెదిరించడం కేసీఆర్ (KCR) పాలనలో జరుగుతోందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender). వికారాబాద్ జిల్లా పరిగి (Parigi) నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా నిర్వహిస్తున్న ఆశావర్కర్ల (Asha Workers) శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వద్దురా నాయనా కేసీఆర్ పాలన అని.. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ వెంటనే నెరవేర్చాలని అన్నారు. ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకి సేవలు అందిస్తున్నారని.. ప్రజలకు, ఆసుపత్రులకు వారధిగా ఉన్నారని వివరించారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచాలని అడుగుతున్నారని.. అలాగే, కుటుంబ సభ్యులకు వైద్యం అందించేందుకు హెల్త్ కార్డు ఇవ్వమని అడుగుతున్నారని అన్నారు. అన్నిటికంటే ముందు ఉద్యోగ భద్రత కల్పించండి అని కోరుతున్నారని ప్రభుత్వానికి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్య సూచికలు ఎంత ఉన్నాయో ఆస్థాయిలో తెలంగాణ నిలబడడానికి ఆశావర్కర్ల కృషి కూడా ఉందని.. అలాంటి వారిని కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సమ్మె చేస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని.. కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు తప్ప వీరికి ఏ కావాలి అని ఆలోచన చేసే సోయి, జ్ఞానం లేదన్నారు. చిన్న వర్కర్లు అని, వారేం చేస్తారులే అని అహంకారంతో మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సెకెండ్ ఏఎన్ఎం, కార్యదర్శులు, వీఆర్ఏ, వీఆర్వో, ఆర్టీసీ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఇలా ఎవరు సమ్మె చేసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని మండిపడ్డారు ఈటల. చిన్నవారు అని పట్టించుకోవడం లేదేమో కానీ.. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. వారి ఓట్లతోనే గెలిచారు అని మర్చిపోవద్దని.. ఆశా వర్కర్లను మంత్రి పిలిచి చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.