రాష్ట్రంలో 11 శాతం ఉన్న ముదిరాజ్ లకు ఏ పార్టీ కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ (BJP) తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ…. ఈ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఈ సభకు హాజరయ్యే వాళ్లకు ప్రభుత్వ పథకాలు ఇవ్వబోమంటూ బెదిరించారని ఆయన ఆరోపించారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ లెక్క చేయకుండా ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు భారీగా జనం తరలి వచ్చారని చెప్పారు. తన 20 ఏండ్ల రాజకీయ జీవితం గురించి అందరికీ తెలుసని పేర్కొన్నారు. 14 ఏండ్ల పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబడి పోరాటం చేశానని గుర్తు చేశారు.
తనపై ఎన్ని కేసులు పెట్టినా, చంపుతామని గూండాలతో బెదిరించినా తాను వెనక్కి తగ్గలేదన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల సమస్యలపై తాను గొంతెత్తి పోరాటం చేశానన్నారు. ముదిరాజ్‌లను బీసీ – డీ నుండి బీసీ- ఏ కేటగిరీలోకి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని పార్టీల్లో ముదిరాజ్ లకు ప్రాధాన్యత కల్పించాలన్నారు.