తొమ్మిదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులుపడ్డారని అన్నారు బీజేపీ (BJP) రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender). పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొని ప్రసంగించారు ఈటల. రేకులు అడ్డం పెట్టుకొని ఉండేవాళ్లకు 9 ఏళ్ల 2 నెలల కాలంలో ఇళ్లు అందలేదని అన్నారు. మాటలు చెప్పిన కేసీఆర్ కళ్ళలో మట్టి కొట్టారని ఆరోపించారు.
సనత్ నగర్ నియోజకవర్గంలో వంద ఇళ్ళు కట్టి.. తెలంగాణ నలుమూలల నుండి ఆడబిడ్డలను తీసుకువచ్చి చూపించారని గుర్తు చేశారు. 9 ఏళ్ళు గడిచినా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న హడ్కో రూ.9 వేల కోట్ల అప్పు ఇచ్చిందని.. రూరల్ అర్బన్ మిషన్ కింద రూ.1,311 కోట్లు మోడీ సర్కార్ ఇచ్చిందని వివరించారు. 9 ఏళ్లలో 20 లక్షల బడ్జెట్ పెట్టిన కేసీఆర్.. డబుల్ బెడ్రూం కోసం ఇచ్చింది 600 కోట్లు మాత్రమేనని తెలిపారు.
ఇళ్లు పంచని కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈటల. ‘‘2014 బడ్జెట్ లక్ష కోట్లు. ఇప్పుడు అది 3 లక్షల కోట్లకు చేరింది. 120 రూపాయలు ఉన్న సిమెంట్ 300 రూపాయలకు చేరింది. 35 రూపాయలున్న ఐరన్ 65 కు చేరింది. మేస్త్రీ కూలీ 600 నుండి 1,500 అయ్యింది. అదే.. 2014లో 5 లక్షల రూపాయలు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. 3 లక్షల రూపాయలు బిక్షంలా ఇస్తారా? పునాదులు కూడా పడవు’’ అని మండిపడ్డారు. సచివాలయం 600 కోట్లతో మొదలు పెట్టి 1600 కోట్లతో కట్టారని.. ప్రగతి భవన్ 60 కోట్లతో మొదలు పెడితే 150 కోట్లు అయ్యిందని తెలిపారు. గృహలక్ష్మి పథకానికి 5.04 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది 3 నెలల సమయమేనన్న ఆయన.. గృహలక్ష్మి పథకం కేవలం ఓట్ల కోసమే తెచ్చారని ఆరోపించారు. బీజేపీని ఆశీర్వదించాలని.. 5.04 లక్షలతో కేంద్ర ప్రభుత్వం, మోడీ సహకారంతో ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తమకు కులం, మతం, రాజకీయంతో సంబంధం లేదని… ఇళ్లు లేకుండా బిక్కు బిక్కుమంటూ ఉన్నవారికి ఇస్తామని తెలిపారు. ‘‘పట్టణాల్లో అపార్ట్మెంట్స్ కట్టించాలి. అర్బన్ హౌసింగ్ కింద కేంద్రం ఇస్తున్న నిధులు వాడాలి. పక్కన ఉన్న ఏపీని పేద దివాలా రాష్ట్రం అని కేసీఆర్ చెప్తారు. కానీ, అక్కడ కూడా కేంద్ర సహకారంతో 20 లక్షల ఇళ్లు కట్టారు అని పేపర్లో రాస్తున్నారు. మళ్లీ నీకు అధికారం రాదు’’ అంటూ విమర్శలు గుప్పించారు.
కోకాపేటలో ఎకరం 100 కోట్లకు అమ్మితే మురిసిపోయిన కేసీఆర్ కు.. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పేదవాడికి 60 గజాల జాగా ఇచ్చే దమ్ముందా? అని అడిగారు ఈటల. పైగా, 60 ఏళ్ల క్రితం ఇచ్చిన భూములు అమ్ముకోలేరని ప్రజలను భయపెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా పేదల కళ్ళలో మట్టి కొట్టి.. 5800 ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. బీజేపీకి కేసులు కొత్త కాదని.. పేదల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే 17 పేపర్లు లీక్ అయ్యాయన్న ఈటల… డబ్బులు పెట్టినవాడికే ఉద్యోగాలు ఇచ్చిన నీచపు ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు. గ్రూప్-2 పరీక్ష పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారని.. మానవతా కోణంలో వాయిదా వేయాలని కోరారు ఈటల రాజేందర్.