Telugu News » Harish Rao : కాంగ్రెస్ దరిద్రం మళ్లీ వద్దు!

Harish Rao : కాంగ్రెస్ దరిద్రం మళ్లీ వద్దు!

ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ మళ్ళీ బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

by admin
Harish Rao Comments On Congress

సంగారెడ్డి (Sangareddy) నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు (Harish Rao). ముందుగా, బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.

Harish Rao Comments On Congress

సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ అందించారు హరీష్ రావు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. అనంతరం అకాల వర్షాలతో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు (Farmers) పరిహారం అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. 4,300 ఎకరాలలో పంట నష్టానికి 4 కోట్ల 5 లక్షల రూపాయలను 393 మంది రైతులకు వారి బ్యాంకు (Bank) ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.

గతంలో వున్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వర్షాలకు పంట దెబ్బతింటే ఎకరానికి 2 వేలు ఇచ్చేదని.. అదికూడా ఎప్పుడొస్తాయో తెలిసేది కాదని చెప్పారు. కానీ, తెలంగాణ రైతు ప్రభుత్వం ఎకరానికి 10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తోందని తెలిపారు. రూ.99 వేల పంట రుణాల మాఫీకి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం రైతులకు విడుదల చేయనుందని చెప్పారు. మరో పక్షం రోజుల్లో లక్ష ఆపై ఉన్న పంట రుణాలను కూడా మాఫీ చేస్తామని తెలిపారు.

‘‘రేవంత్ రెడ్డి 3 గంటలు రైతులకు చాలు అంటున్నాడు వారికి మీరే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అంటే యూరియా బస్తాలకోసం చెప్పులు లైన్ లో పెట్టిన ప్రభుత్వం. కేసీఆర్ రుణమాఫీ చేయడేమో అని ధర్నా చేద్దాం అనుకున్న కాంగ్రెస్ వాళ్లకు రైతులు దొరకడం లేదు. ధరణితో రైతులకే పూర్తి సర్వాధికారాలు తమ భూములపై వచ్చాయి. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ మళ్ళీ బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు’’ అని ప్రశ్నించారు. 3 గంటల కరెంటు ఇస్తామనే కాంగ్రెస్ కావాలో, బాయిలకాడ మీటర్లు పెడతామన్న బీజేపీ కావాలో, 3 పంటల 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు హరీష్ రావు.

You may also like

Leave a Comment