ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ (TSPSC)కి చైర్మన్ కన్ఫామ్ అయ్యారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy) చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన నియమాకాన్ని గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆమోద ముద్ర వేశారు. ఈ అంశంపై చర్చించేందుకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గవర్నర్ ను కలిశారు. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఓకే చెప్పారు.
టీఎస్పీఎస్సీ సభ్యులుగా అనిత రాజేంద్ర, పాల్వాయి రజిని, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావులు వ్యవహరించనున్నారు. ఇంతకుముందు చైర్మన్ పదవిలో జనార్థన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయన రాజీనామా చేశారు. జనార్థన్ రెడ్డి హయాంలోనే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ కావటం.. పరీక్షలు వాయిదా పడటం జరిగింది. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. కొత్త ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకున్న జనార్థన్ రెడ్డి.. తనకు తానుగా రాజీనామా చేశారు.
కొత్త చైర్మన్ పదవికి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. సమర్థత, భద్రత, విశ్వసనీయత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పోస్టుకు మహేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సును ఆమోదించారు గవర్నర్ తమిళిసై. ముందు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్ తదితరుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. అయితే పదవిని తీసుకునేందుకు ఆకునూరి మురళి అంగీకరించలేదని సమాచారం.
ఇటు, ప్రవీణ్ కుమార్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ను స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదు. రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పినట్లు సమాచారం. దీంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.