లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ (Congress)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేశారు. తాజాగా మరో నేత ఆ పార్టీని వీడనున్నారు. మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ (Kamal Nath) బీజేపీ గూటికి చేరుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు నకుల్ నాథ్ కూడా కాషాయ పార్టీలోకి వెళ్తున్నట్టు సమాచారం.
ఈ వార్తలకు బలం చేకూర్చేలాగా బీజేపీ అధికార ప్రతినిధి, కమల్ నాథ్ మీడియా మాజీ సలహాదారు నరేంద్ర సలూజా ఓ ట్వీట్ చేశారు. అందులో కమల్ నాథ్, ఆయన కుమారుడు నకుల్ నాథ్‌లు భోపాల్‌లో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. దానికి జై శ్రీ రామ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
మరోవైపు కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ తన ట్విట్టర్ బయోలో కాంగ్రెస్ పార్టీని తీసేశారు. దీంతో ఆ ఇద్దరు నేతలు బీజేపీలోకి చేరబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇలా వుంటే ఈ వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు..మాజీ ముఖ్య మంత్రి దిగ్విజయ్ సింగ్ స్పందించారు.
నెహ్రూ-గాంధీ కుటుంబంతో కలిసి కమల్ నాథ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ను విడిచి పెడతాడని మనం ఎలా ఆశించగలం? అని ప్రశ్నించారు. అలాంటి విషయాన్ని మనం కలలో కూడా ఆశించకూడదు అని పేర్కొన్నారు. ఇక సోన్ కచ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సజ్జన్ సింగ్ వర్మ సోషల్ మీడియాలో తన ప్రొఫైల్‌ల నుండి పార్టీ లోగోను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ కు భారీ షాక్ తప్పదని అంతా చర్చించుకుంటున్నారు.