నిర్మల్ (Nirmal) మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తోంది బీజేపీ (BJP). ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న భూములను తక్కువ ధరకు కొన్న బీఆర్ఎస్ (BRS) నేతలు వాటిని కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చుకునేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ నుంచి జీవో నెంబర్ 220ను జారీ చేయించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheswar Reddy) ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నారు. అయితే.. పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.
ఏలేటి నిరాహార దీక్షతో నిర్మల్ లో టెన్షన్ వాతావరణం కనిపించింది. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాల్సిందేనని బీజేపీ శ్రేణులు నిత్యం ధర్నాలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఇతర జిల్లాల నేతలు నిర్మల్ బాట పట్టారు. ఆదివారం మహేశ్వర్ రెడ్డి దగ్గరకు వెళ్లేందుకు బీజేపీ నేతలు డీకే అరుణ (DK Aruna), అరవింద్ (Aravind) ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు.
రోజురోజుకీ ఏలేటి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే నిరాహార దీక్షను పోలీసులు (Police) భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. ముందు గేటుకు తాళం వేసి పోలీసులను లోనికి అనుమతించలేదు. గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
గేటు తాళం పగులగొట్టిన పోలీసులు.. ఇంట్లోకి ప్రవేశించి మహేశ్వర్ రెడ్డి దగ్గరకు వెళ్లారు. ఇదే సమయంలో పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఏలేటికి పోలీసులు సూచించగా, అందుకు ఆయన నిరాకరించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.