మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో (Nagpur) ఉన్న ఓ సోలార్ కంపెనీలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాగ్‌పూర్‌లోని బజర్గావ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బజర్గావ్లో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్‌లో(Solar Industries India Limited) ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పేలుడులో ధాటికి తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
రక్షణ శాఖకు అవసరమైన పేలుడు పదార్థాలతోపాటు రక్షణ సామగ్రిని ఈ కంపెనీలోనే తయారవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ సమయంలో పేలుడు జరిగినట్లు గుర్తించారు. సోలార్ ఎక్స్‌ప్లోజింగ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు.
ఈ ఘటనపై పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.