డేనియల్ తుఫాన్ బీభత్సంతో విలవిల లాడిపోతున్న లిబియాకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడం అధికారులకు అతి పెద్ద సమస్యగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాలనుకున్న రెస్క్యూ బృందాలకు పేలుడు పదార్థాల భయం పట్టుకుంది. వరద ప్రభావ ప్రాంతాలకు వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ జంకుతున్నాయి.
ఇంతకు ఏం జరిగిందంటే…. 2011 నుంచి లిబియాలో అంతర్యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పలు చోట్ దళాలు బాంబులు పాతి పెట్టాయి. ఎనిమిది దశాబ్దాలుగా లిబియా భూ భాగంలో బాంబులు, ల్యాండ్ మైన్స్ పేలకుండా అలానే వున్నాయని అధికారులు చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబులు కూడా ఇప్పటి వరకు లిబియాలో వున్నాయని ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ చెబుతోంది.
సాధారణంగా వార్ జోన్ ఏరియాలో భారీ వరదలు వచ్చినప్పుడు మందుపాతరలు, బాంబులు కొట్టుకుని వచ్చే అవకాశాలు వుంటాయని చెప్పింది. 1995లో బోస్నియా వరదలు వచ్చిన సమయంలో ఇలాంటి ఘటనలు జరిగాయని వెల్లడించింది. ఇటీవల ఉక్రెయిన్ లో ఓ డ్యామ్ ను పేల్చి వేసిన సందర్భంలో ఇలాంటి భయాలే నెలకొన్నాయని గుర్తు చేసింది.
ఇది ఇలా వుంటే లిబియాలోని డెర్నా నగరంలో డేనియల్ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. భారీ వరదలకు నగరంలోని వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11,300 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో పది వేల మందికి పైగా గల్లంతైనట్టు పేర్కొన్నారు. డెర్నా నగరంలో శిథిలాలు, ఇసుక మేటలు తొలగించే కొద్ది మృత దేహాలు కుప్పలుగా బయటకు వస్తున్నాయి.