టెక్నాలజీ పరుగులు పెడుతోన్న కాలం ఇది. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు. ఉన్నది ఖాళీ ఖాయం. రెప్పపాటులో మొత్తం దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. కొత్త కొత్త పద్దతుల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఈసారి ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకే ఝలక్ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు సైబర్ నేరగాళ్లు. దాని నుంచి పలువురు ప్రముఖులు, బీఆర్ఎస్ నేతలు, ఇతరులకు ఫాలో రిక్వెస్ట్ లు పంపారు. మన ఎమ్మెల్యేనే కదా అని చాలామంది సైబర్ నేరగాళ్ల టచ్ లోకి వెళ్లారు. చాటింగ్ మొదలుపెట్టారు. అలా, వారితో చాట్ చేస్తూ.. కాస్త అవసరం ఉంది.. డబ్బులు పంపించాలని అడిగారు.
ఎమ్మెల్యే అయి ఉండి డబ్బులు అడగడం ఏంటని కొందరికి అనుమానం వచ్చింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరకు సురేందర్ కు తెలిసింది. కాసేపు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. తర్వాత తేరుకుని.. తన పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని.. ఎవరూ పంపవద్దని సూచనలు చేశారు.
ఆ అకౌంట్ ను బ్లాక్ చేయాలని కోరిన ఎమ్మెల్యే… ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రమంతా ఈ న్యూస్ పై తెగ చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేకే సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇవ్వడంతో అందరూ దీనిపై మాట్లాడుకుంటున్నారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు సురేందర్. బీఆర్ఎస్ అభ్యర్థిపై 31వేలకు పైనే ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించారు. అయితే.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు సురేందర్.