కామారెడ్డి (Kama Reddy) నుంచి బరిలోకి దిగుతున్న సీఎం కేసీఆర్ (CM KCR)కు ఆ జిల్లా రైతులు షాక్ ఇచ్చారు. రోడ్ల విస్తరణ కోసం తీసుకు వచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయకపోతే సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తామంటూ రైతన్నలు హెచ్చరించారు.
జిల్లాలో నూతనంగా రోడ్ల విస్తరణ కోసం ఇటీవల ప్రభుత్వం కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకు వచ్చింది. ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులంతా కలిసి ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డారు. తాజాగా కమిటీ సమావేశాన్ని లింగాపూర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాల గురించి అన్నదాతలు చర్చించారు.
మాస్టర్ ప్లాన్ వల్ల పలువురు అన్నదాతలు భూమి కోల్పోతున్నానని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అలాంటి ఘటనలు పునరావృతం కాకముందే ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తానని ప్రకటించిన తర్వాత నియోజక వర్గంలో సీఎం కేసీఆర్ అడుగు పెట్టాలని సూచించారు.
భూములను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని రైతులు తేల్చి చెప్పారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని రైతన్నలు హెచ్చరించారు. కామారెడ్డిలో తనకు పని ఉందని అందుకే అక్కడ నుంచి పోటీ చేస్తున్నానని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేశారు.
కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు ఉన్న పని ఏంటని ప్రశ్నించారు. గజ్వేల్‌లో భూములు అయిపోయాయి, ఇప్పుడు కామారెడ్డి భూములపై పడ్డారా అని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్టు గవర్నర్ ద్వారా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రతి గ్రామం నుంచి 15 చొప్పున కేసీఆర్‌పై 100 నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు.
నామినేషన్ల విషయంలో పార్టీలకతీతంగా రైతులంతా సంఘటితం అవుతామన్నారు. 9 గ్రామాల్లో ఉన్న రైతులకు సంబంధించిన బంధువులతో కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 9 గ్రామాలే కాదు నియోజకవర్గం మొత్తం నేతలంతా కలిసి కాళ్లు మొక్కినా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసి తీరుతామన తెగేసి చెప్పారు.