పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తేవడం సహా పలు డిమాండ్లను పరిష్కరించాలని రైతులు చేపట్టిన పాదయాత్ర నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం రెండో రోజు కొనసాగగా బారికేడ్ల వద్దకు రాకుండా రైతులపైకి హర్యానా పోలీసులు(Haryana Police) టియర్‌గ్యాస్(Teargas) ప్రయోగించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. శంభు దగ్గర వరుసగా ట్రాక్టర్లు నిలిచిపోయాయి. హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో సిమెంటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్ భూభాగంలోకి వెళ్లాయి. దీంతో పంజాబ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పటియాలా డిప్యూటీ కమిషనర్ షౌకత్ అహ్మత్ అంబాలా డీసీకి లేఖ రాశారు.
ఇదిలా ఉండగా ఢిల్లీలో ఉద్రిక్తతల నడుమ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రైతులతో మరోసారి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. చర్చలు జరిగే విధంగా రైతులు సహకరించాలని కోరారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దన్నారు.