మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలు అని ఎవరు అన్నారో కానీ.. నేటి సమాజంలో మాత్రం ఈ మాటలు అక్షర సత్యాలు.. అసలు రిలేషన్ అనే మాటకి విలువ లేకుండా పోయింది. మరోవైపు అన్నీ సమస్యలకు చావు పరిష్కారం అనే దిశగా మనిషి ఆలోచనలు కొనసాగుతోన్నాయి. చావడానికైనా, చంపడానికైనా వెనుకాడని ప్రపంచంలో ఎదుగుతోన్న సమాజం ఏనాటికైనా ప్రమాదం. అదీగాక పిల్లల పట్ల తల్లిదండ్రుల తీరు మరీ దారుణంగా మారింది అనడాని ఎన్నో ఉదాహరణలు నిత్యం వార్తల రూపంలో చెవిన పడుతున్నాయి.
ఇలాంటి దారుణం హైదరాబాద్ (Hyderabad) బోయిన్‌పల్లి (Bowenpally)లో చోటు చేసుకొంది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లను చంపేసి ఆపై తాను కూడా ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. స్థానికంగా నివాసముండే శ్రీకాంతా చారి(42) వెండి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ తన ఇద్దరు కూతుళ్లు స్రవంతి (8), శ్రావ్య (7)లకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి తాను కూడా వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒకే ఇంట్లో ముగ్గురూ చనిపోవటంతో బోయినపల్లిలో విషాదం అలుముకుంది. కుటుంబ కలహాలతో శ్రీకాంతాచారి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు (Police) ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఆయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.