హైదరాబాద్ అమీర్‌పేట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) గన్‌మెన్ ఫజల్ అలీ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తన కుమార్తె కళ్లెదుటే ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, బ్యాంకుల రుణ వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫజల్ అలీ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పలు బ్యాంకుల్లో తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించినా.. వడ్డీ రేట్లు ఎక్కువ వేసి ఆ మొత్తాన్నీ చెల్లించాలని ఒత్తిడి చేశారని ఆయన కుమార్తె సంబ్రిన్ మీడియాకు వెల్లడించారు.
రికవరీ ఏజెంట్లు తరుచుగా ఫోన్స్ చేసి తనను వేధించినట్లు తండ్రి చెప్పారని సంబ్రిన్ పేర్కొన్నారు. ‘నాన్న ఉదయం విధుల్లోకి వెళ్తున్నప్పుడు తనను కూడా రమ్మన్నారని చెప్పారు. తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులపై కొన్ని విషయాలు నాతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడే వస్తా అని పక్కకి వెళ్లి ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు..’ అటూ ఆవేదన వ్యక్తం చేసింది.
తన తండ్రి మృతికి కారణమైన బ్యాంకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సంబ్రిన్ కోరింది. గన్‌మెన్ సూసైడ్ గురించి తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. అదేవిధంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు.