అమెరికాలో ఓ 29 ఏళ్ల భారతీయ మహిళ ఆచూకీ కోసం భారీ రివార్డును ప్రకటించింది ఎఫ్‌బీఐ(FBI). సదరు మహిళ నాలుగేళ్ల నుంచి కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలిపిన వారికి ఏకంగా 10వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.8,32,610) రివార్డును ఎఫ్‌బీఐ(FBI Reward) ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
న్యూజెర్సీలో మయూషీ భగత్ అనే మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. 2019, ఏప్రిల్ 29వ తేదీన ఆమె కనిపించకుండాపోయింది. ఆమె ఇంటి నుంచి వెళ్లినప్పుడు కలర్ పైజామా, బ్లాక్ టీ షర్ట్ ధరించింది. మయూషీ మిస్సింగ్‌పై ఆమె కుటుంబసభ్యులు మే 1వ తేదీనే ఫిర్యాదు చేశారు.
ఎఫ్‌బీఐ తన మోస్ట్ వాంటెడ్ పేజీలో మయూషీ భగత్‌కు చెందిన మిస్సింగ్ పర్సన్ పోస్టర్‌ను పోస్టు చేసింది. ఆమె మిస్సింగ్ గురించి ఎఫ్‌బీఐ నివార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం వెతుకుతూనే ఉన్నది. అయితే ఆమె ఎక్కడున్నది ఇంత వరకు తెలియలేదని దీంతో భారీ రివార్డును ప్రకటిస్తున్నట్లు ఎఫ్‌బీఐ రివార్డు ప్రకటించింది.
మయూషీ 1994లో వడోదరాలో జన్మించింది. ఆమె స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లింది. న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యనభ్యసిస్తోంది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలను మాట్లాడగలదని ఎఫ్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.