1857 సిపాయిల తిరుగుబాటు…. ఈ పేరు చెప్పగానే ఎంతో మంది వీరులు గుర్తుకు వస్తారు. కానీ ఈ పోరాటంలో వీరులే కాదు బ్రిటీష్ (British) వారికి ముచ్చెమటలు పట్టించిన వీరనారీమణులు ఎందరో వున్నారు. అలాంటి వారిలో షహీద్ ఉదా దేవీ (SHAHEED UDA DEVI PASI) ఒకరు. బ్రిటీష్ కు వ్యతిరేకంగా దండు కట్టి మెరుపు దాడి చేసిన వీర మహిళ ఆమె.
1857లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరు జరిపిన రాజ్యాల్లో అవద్ కూడా ఒకటి. అవద్ నవాబ్ వాజీద్ అలీ షా భార్య బేగం హజ్రత్ మహల్ దగ్గర మక్కా పసి సైనికుడిగా పని చేశారు. ఆ మక్కా పసి భార్యే షహీద్ ఉదా దేవీ. భారతీయులపై బ్రిటీష్ వారి హింసాకాండను చూసి భరించలేక వారిపై ఎదురు తిరగాలని నిర్ణయించుకుంది.
అనుకున్నదే తడవుగా బ్రిటీష్ వారిపై పోరకు సై అంది. హజ్రత్ మహల్ ను ఒప్పించి మరి పోరు బాట పట్టింది. తన లాంటి మహిళలను మరి కొందరని ఒక చోట చేర్చి దండు కట్టి దాడికి రెడీ అయింది. సికిందర్ బాగ్లో సివంగిలాగా దూకింది. రావి చెట్టుపై నుంచి బ్రిటీష్ సేనలపై తూటాల వర్షం కురిపించింది.
బుల్లెట్ల వానకు బ్రిటీష్ సైనం చెల్లా చెదురు అయింది. తూటాలకు తూటాతో సమాధానం చెప్ప లేక బ్రిటీష్ సైన్యం కుట్ర మార్గాన్ని అనుసరించింది. ఆ చెట్టుకు నిప్పటించి ఆమెను సజీవ దహనం చేసింది. విలియమ్ ఫోర్బ్స్- మిచెల్ అనే బ్రిటన్ రచయితలు ‘రెమినిసెన్సెస్ ఆప్ గ్రేట్ మ్యుటినీ’అనే పుస్తకంలో ఆమె పోరాటం గురించి వర్ణించారంటేనే ఆమె వీరత్వం ఎలాంటిదో అర్థం అవుతుంది.