Telugu News » రాజ్ భ‌వ‌న్ కు సీఎం.. రావాల్సొచ్చింది!

రాజ్ భ‌వ‌న్ కు సీఎం.. రావాల్సొచ్చింది!

by admin
Finally After A Year CM KCR Back in Raj Bhavan

ప్ర‌గ‌తి భ‌వ‌న్ రాజ్ భ‌వ‌న్ మ‌ధ్య వైరం చాన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్రోటోకాల్ ను ప్ర‌భుత్వం ప‌క్క‌కు పెట్టేయ‌డం.. ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం త‌ర‌చూ జ‌రుగుతోంది. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల త‌ర్వాత బీఆర్ఎస్ నేత‌లు మూకుమ్మ‌డిగా దండ‌యాత్ర చేయ‌డం కూడా కామ‌న్ అయిపోయింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ్ భ‌వ‌న్ వైపు క‌న్నెత్తి చూడ‌డం మానేశారు సీఎం కేసీఆర్. అధికారికంగా పాల్గొనాల్సిన కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆయ‌న డుమ్మా కొడుతూ వ‌స్తున్నారు. కానీ, ఈసారి రాజ్ భ‌వ‌న్ లో ఆయ‌న అడుగు పెట్ట‌క త‌ప్ప‌లేదు.

Finally After A Year CM KCR Back in Raj Bhavan

ఈమ‌ధ్యే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ అరాధే నియామకమయ్యారు. మొన్న‌టిదాకా ఈయన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం అరాధేను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ ఇటీవ‌ల కేంద్రానికి సిఫారసు చేసింది. ఆ సిఫార‌సుకు ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ నోటిఫై చేస్తూ త‌ర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాజ్ భ‌వ‌న్ లో అలోక్ అరాధే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్ర‌మాణం చేశారు.

రాజ్​ భవన్ లో ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. గ‌తేడాది జూన్ లో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం ఆ తర్వాత ఆ గ‌డ‌ప తొక్క‌డం ఇదే. సంవత్సరం దాటిన తర్వాత ఇన్నాళ్ల‌కు రాజ్ భవన్ ​కు వెళ్లారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సహా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ​రెడ్డి సైతం హాజరయ్యారు.

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వి విష‌యంలో రాజ్ భ‌వ‌న్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య వైరం మొద‌లైంది. అంత‌కుముందు వ‌ర‌కు అధికార‌క కార్య‌క్ర‌మాల్లో ప‌క్క‌ప‌క్క‌నే క‌నిపించిన కేసీఆర్, త‌మిళిసై ఆ త‌ర్వాత చెరో దారిలో న‌డిచారు. ఆఖ‌రికి వీళ్ల పంచాయితీ.. సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. పెండింగ్ బిల్లుల విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ ఆల‌స్యం చేస్తున్నార‌ని ప్ర‌భుత్వం సుప్రీంను ఆశ్ర‌యించింది. ఈ వివాదం కొన‌సాగుతుండ‌గానే సీఎం రాజ్ భ‌వ‌న్ కు వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

You may also like

Leave a Comment