భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) నాల్గవ రోజుకు చేరుకుంది. అసోం (Assam)లోని మజోలిలో యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం జోరహట్ గుండా యాత్ర సాగింది. ఆ సమయంలో యాత్రపై కేసు నమోదైంది. పట్టణంలో అనుమతి లేని ప్రాంతంలో యాత్ర చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతించిన కేబీ రోడ్ గుండా కాకుండా ఇతర మార్గంలో యాత్ర సాగిందని పోలీసులు చెబుతున్నారు.
ఆ ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఆ యాత్రలో పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు. రాహుల్ గాంధీని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో యాత్రపై సుమోటో కేసు నమోదు చేసినట్టు జోరహట్ ఎస్పీ వివరించారు. యాత్ర నిర్వహణ విషయంలో పార్టీ జిల్లా యంత్రాంగం నిబంధనలు పాటించలేదని పోలీసులు తెలిపారు.
భారత్ జోడో న్యాయ యాత్ర మజోలీ ప్రాంతానికి చేరుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనకుండా చేసేందుకు అసోం సీఎం హిమంత బిస్వశర్మ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ యాత్రను ఎవరూ ఆపలేరన్నారు.
మరోవైపు యాత్రను ముందుకు సాగనివ్వకుండా అడగడుగునా అసోం సర్కార్ ఆటంకం కలిగిస్తోందని కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియా అన్నారు. ‘పీడబ్ల్యూడీ పాయింట్ వద్ద ట్రాఫిక్ పోలీసులెవరూ లేరు. గతంలో నిర్ణయించిన మార్గం చాలా చిన్నదిగా ఉంది. ఈ కారణంగానే వేరే మార్గాన్ని ఎంచుకున్నాం. మేము కేవలం కొన్ని మీటర్ల పరిధి వరకు మాత్రమే పక్క మార్గంలో యాత్ర చేపట్టాం. అసోంలో తొలిరోజు యాత్ర విజయవంతమవుతుందన్న భయంతోనే సర్కార్ ఇలాంటి చర్యలు తీసుకుంటోంది’అని ఆరోపించారు.