విశాఖపట్నం(Vishakapatnam) జగదాంబ జంక్షన్(Jagadamba Junction)లో ఉన్న ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident in Hospital) సంభవించింది. ఆస్పత్రిలో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. రెండవ అంతుస్తులోని ఆపరేషన్ థియేటర్(Operation Theater)లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నారు.
కొందరు భయంతో పరుగులు తీస్తుంటే మరికొంత మందిని ఆస్పత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఐసీయూలో సీరియస్‌గా ఉన్న ఏడుగురిని దగ్గరలో ఉన్న మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఆపరేషన్ థియేటర్‌లో మొత్తం 47 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.
పొగలో చిక్కుకున్న రోగులు కాసేపు ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆసుపత్రి మంటల్లో చిక్కుకున్న అందరినీ ఆసుపత్రి సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నైట్రస్ ఆక్సైడ్ కారణంగా సిలిండర్ పేలి ఆపరేషన్ థియేటర్‌లో ముందుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
దట్టంగా కమ్ముకున్న పొగను బయటకు పంపించేందుకు అక్కడి కిటికీ అద్దాలను ఆసుప్రతి సెక్యూరిటీ సిబ్బంది పగుల గొట్టారు. షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలానికి రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. రోగుల బంధువులు, పోలీసులు, స్థానిక ప్రజలు గుమిగూడటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇప్పటికైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.