జగిత్యాల (Jagityal) జిల్లాలోని ఆర్టీసీ (RTC) డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోరుట్ల (Korutla) డిపోలో బస్సులో మంటలు ( Flames) చెలరేగాయి. బస్సులో డీజిల్ నింపిన కొద్ది సేపటికే మంటలు అంటుకున్నాయి. దీంతో రాజధాని (Rajadhani) బస్సు పూర్తిగా దగ్దమైంది.
భారీగా మంటలు ఎగసి పడటంతో స్థానికులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పక్కనే ఫ్యూయల్ స్టేషన్ ఉండటంతో అధికారులు కంగారు పడ్డారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పి వేశారు.
దీంతో పెను ప్రమాదం తప్పడంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజధాని బస్సు శంషాబాద్ నుంచి ట్రిప్ ముగించుకుని కోరుట్లకు వచ్చింది. ప్రయాణికులను బస్ స్టాండ్ లో దింపేసి బస్సును డిపోకి తీసుకు వచ్చారు. బస్సును సిబ్బంది శుభ్రం చేస్తుండగా మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. బస్సు బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి వుంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.