దక్షిణ అమెరికా (South America), సెంట్రల్ చిలీ (Central Chile) అడవిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో 46 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇదంతా అటవిప్రాంతమే కావడం.. అందులో స్థానికంగా ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తుండటం వలన భారీ నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. శాంటియాగో (Santiago) ప్రాంతంలో మొదలైన మంటలు జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని సమాచారం.
దీంతో చాలా మంది ప్రజల ఆచూకీ సైతం గల్లంతైనట్లు తెలుస్తోంది. భారీ మంటలకు తోడు దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల, మంటలను అదుపు చేయడంలో ఆలస్యం అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.. దీంతో భారీగా ఎగిసిపడుతున్న మంటలు అటవీ ప్రాంతం మొత్తం పాకుతున్నాయని, ఇప్పటికే ఈ ప్రమాదంలో 106,000 ఎకరాల అడవి కాలిపోయిందని వారు తెలిపారు.
మరోవైపు రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 310 మైళ్ల దూరంలో ఉన్న బయోబియోలోని శాంటా జువానా పట్టణంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 11 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. ఇక భారీ అగ్ని ప్రమాదం తర్వాత పలు ప్రాంతాల్లో దట్టమైన బూడిద పొగ కమ్ముకొంది. ముఖ్యంగా వాల్పారైసో పర్యాటక ప్రాంతం, మధ్య చిలీ తీరప్రాంతాన్ని బూడిద తో కూడిన పోగ కప్పివేసింది. దీంతో ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు.
ఈమేరకు అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ శనివారం చిలీ దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లోకి అత్యవసర సామాగ్రిని అనుమతించడానికి అధికారులు శనివారం కర్ఫ్యూ విధించారు. కొత్త తరలింపు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కాగా దేశవ్యాప్తంగా 92 అటవీ ప్రాంతంలో మంటలు సంభవించాయని, 106,000 ఎకరాలు కాలిపోయాయని చిలీ అంతర్గత మంత్రి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని, అడవిలో మంటలు 40 శాతం అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు.