షాపింగ్ మాల్(Shopping Mall)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్థుల్లో మంటలు చెలరేగి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy Dist)లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు మాల్లోని మిగతా అంతస్థులకు వ్యాపించాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు ఆందోళనకుగురై పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జేసీబీ సాయంతో మాల్ షట్టర్లను తొలగించారు. ఉదయం 7గంటల వరకు రెండు అంతస్తుల్లో మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.
మిగతా రెండు అంతస్తుల్లోని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదంలో రూ.6కోట్ల విలువైన సామగ్రి మంటల్లో బూడిదైందని మాల్ నిర్వాహకులు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు.