నిజామాబాద్ (Nizamabad)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. నగరంలోని దేవీ రోడ్డులో ఉన్న బాలాజీ శానిటరీ షాపులో నుంచి మంటలు రావడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Fighters) వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈలోపల పోలీసులు కూడా చేరుకొన్నారు..
మంటలు అదుపులోకి రాకపోవడంతో మరికొన్ని ఫైర్ ఇంజన్లను తెప్పించి మంటలను ఆర్పివేశారు. మంటలను ఆర్పివేసే క్రమంలో నిజామాబాద్ ఫైర్ స్టేషన్ ఇంఛార్జి నర్సింగ్ రావు, లీడింగ్ ఫైర్ మాన్ తిరుపతి, ఫైర్ మాన్ ఆశిష్ కుమార్లకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం..
మరోవైపు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా దగ్ధం కాగా రూ.30 లక్షల వరకు ఆస్థి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఈ సంవత్సరం మొత్తం ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. నగరంలో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకి గురిచేస్తున్నాయి.. సంవత్సరం చివరిలో కూడా అగ్ని ప్రమాదాలు శాంతించడం లేదు..